Friday, April 22, 2022

సినిమా బాల్యం

 After reading a friend’s post on Chikkadapally movie theatres’ I too felt like writing my own nostalgic experience on movie watching during my childhood. Here it goes….

******


నమో వెంకటేశా అంటూ ఘంటసాల గొంతు వినగానే శ్రీనివాస థియేటర్ లో ఫస్ట్ షో టైం అయిందని గుర్తు. మా ఇంటికి దాదాపు ఒక కిలో మీటర్ దూరం లో ఉండేవి రెండు సినిమా హాళ్లు - శ్రీనివాస, ధనరాజ్.  సినిమా మారినప్పుడల్లా  గూడు రిక్షా లో మైక్ పెట్టుకుని పాంఫ్లెట్ పంచుతూ తిరిగేవాళ్లు. కూడా పిల్ల మూక పరుగులు పెట్టేవాళ్ళు. సినిమా హాల్ లో నాలుగు క్లాసులు ఉండేవి - నేల, బెంచి, కుర్చీ, రిజర్వడ్. పిల్లలు మాత్రమే  వెడితే బెంచ్ టిక్కెట్లు, పెద్దలతో కలిసి వెడితే కుర్చీ టిక్కెట్లు. బీడీ, చుట్ట, సిగరెట్ పొగల మేళవింపుకి చేపల వాసన కలిసి హాల్ అంతా గాఢమైన దుర్వాసన అలుముకుని ఉండేది. మూడు ఇంటెర్వల్స్ ఉండేవి ఎందుకో గుర్తులేదు. చాలా సినిమాలు 2-3 రోజులు మాత్రమే నడిచేవి. జనరేటర్ పనిచేయకపోతే సినిమా మధ్యలో కరెంట్ పోయినప్పుడు టికెట్ మీద రాసి ఇచ్చేవాళ్ళు - మర్నాటి షో చూడమని. టికెట్ల కోసం పెద్ద లైన్ ఉండేది కాదు. సులువుగానే తీసుకునేవాళ్ళం. 

ఇంట్లో అక్కకి ఎక్కువ ఇంటరెస్ట్ ఉండేది - నెలకి ఒక సినిమా కోటా అయితే మరో సినిమా కోసం చాలా లాబీ చేసేది అక్క. తనకి అప్రూవల్ వస్తే మాకందరికీ (మేము నలుగురు సిబ్లింగ్స్) వచ్చినట్టే. అమ్మమ్మ నవ్వేది - ఏడిచేదానికి మొగుడు వస్తే నాకూ వస్తాడు అన్నట్టు మీరంతా కూడా మీ అక్క పేరుతొ ఎక్కువ సినిమాలు చూస్తున్నారు అని. 

పెద్దవాళ్ళతో కలిసి వెళ్తే, ఫస్ట్ షో - పిల్లలమే వెడితే సెలవురోజు మాటినీ. ఎండయినా వెన్నెలయినా  నడిచి వెళ్లడం కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. మగపిల్లలు సైకిల్ నడిపించుకుంటూ అమ్మాయిలకి "తోడుగా" వచ్చేవారు 🙂 చూసిన సినిమా కబుర్లు మళ్ళీ నెల ఇంకో సినిమా చూసేదాకా విడతల వారీగా చెప్పుకుంటూనే ఉండేవాళ్ళం. 

సినిమా థియేటర్ల పక్కనే మా  హై స్కూల్.స్కూల్ లో మధ్యాహ్నం క్లాసులు రెండు స్టేషన్లు కలిసిన రేడియో ప్రోగ్రాం లాగా ఉండేవి - థియేటర్ లోంచి సినిమా శబ్దాలు, క్లాస్ లో టీచర్ పాఠాలు - రెండూ కలగలిపి వినేవాళ్ళం. 

తర్వాత హైదరాబాద్ లో నేను ఉద్యోగం చేసిన ఆఫీస్ పక్కనే సప్తగిరి థియేటర్ లో కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతి శుక్రవారం అభిమానులు చేసే హడావుడి చూసినప్పుడల్లా చిన్నప్పటి హై స్కూల్ రోజులు గుర్తు వచ్చేవి. ఎప్పుడూ స్కూల్ కానీ ఆఫీస్ కానీ బంక్ కొట్టి సినిమా కి వెళ్లే ధైర్యం చెయ్యలేదు. 

పరీక్షలు అవగానే ఓ సినిమా, ఎవరేనా బంధువులు వస్తే సినిమా, పుట్టిన రోజుకి సినిమా, ఇలా ఎదో ఒక సందర్భం ఉంటే కానీ సినిమా ఛాన్స్ దొరికేది కాదు. నాకైతే సినిమా కన్నా పుస్తకం ఎక్కువ ప్రియమైన వ్యాపకం. పుస్తక పఠనం గురించి మరో బ్లాగ్ వ్రాస్తాను. 

ఎలాంటి genre చూడాలి అనే ఛాయస్ లేదు. అనుమతి, అవకాశం దొరికినప్పుడు ఏది అందుబాటులో ఉంటె అది చూడడమే. కాకినాడ లో ఎయిర్ కండిషన్డ్ హాల్ లో సినిమా చూడడం జీవితం లో ఒక upgradation. 70 పైసల బెంచ్ టికెట్ నుంచి 700 రూపాయల మల్టీప్లెక్స్ టికెట్ మరొక పూర్తి స్థాయి పరివర్తన. 

ఇప్పుడు netflix / prime వగైరా ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాక, ఫేవరెట్ genre/ actors ఫిక్స్ అయిపోయాక ఆ పాతరోజులు తలచుకుంటే కొంచెం దిగులేస్తుంది. ఇది బావుందా, అది బావుందా అని బేరీజు వేసుకుంటే మనసు "అదే బావుంది" అంటే నమ్మబుద్ధి వేయడం లేదు. మరి మీ సంగతి ఏమిటి?

No comments:

Post a Comment